అయోధ్య గుడి ప్రతిష్టకు రావొద్దు.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. ఇక వచ్చే ఏడాది జనవరి 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగునుంది. అయితే ఈ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే ఇలా కోరుతున్నామని వివరించింది.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary, Champat Rai says, "Any such person who has a constitutional protocol with them is requested to not to come to Ayodhya on the day of 'Pran Pratishtha'... Chief Ministers, Governors,… pic.twitter.com/Dmk1E8CbCJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 12, 2023
స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రొటోకాల్ పాటించే పరిస్థితిలేదని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 26 తరవాత దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానిస్తున్నామన్నారు. వారంతా రామ్‌లాలాకు పూజలు చేసుకోవాలని కోరుతున్నామన్నారు. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను దక్షిణ భారత యాత్రికులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. అలా వచ్చే వారికి వసతి, ఆహార సదుపాయాల ఏర్పాట్లను చేస్తామన్నారు.
జనవరి 2025 నాటికి ఆలయం మూడు దశల్లో పూర్తవుతుంది. ఆలయాన్ని 12 గంటల పాటు తెరిచి ఉంచితే 70,000-75,000 మంది సులభంగా దర్శనం చేసుకోవచ్చని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా.. జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఫిబ్రవరి 5, 2020 మరియు మార్చి 31, 2023 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేశామని , ఇంకా రూ. 3,000 కోట్ల బ్యాంక్ అకౌంట్లలో ఉన్నాయని ట్రస్ట్ గతంలో తెలియజేసింది.