Ayodhya Ram Mandir : 50 దేశల్లో రామాలయ ప్రారంభోత్సవ వేడుక లైవ్

Update: 2024-01-22 02:37 GMT

కోట్లాది మంది హిందువుల కల ఇవాళ నెలవేరనుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నేడు అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కరణ అవుతుంది. మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల శుభముహుర్తమున బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో దీపాల వేడుక వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్కేర్‌ సహా అమెరికాలోని 300 ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాట్లు జరిగాయి. వివిధ నగరాల్లో ఆటో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 10 రాష్ర్టాల్లో 40కిపైగా బిల్‌బోర్డులను విశ్వహిందూ పరిషత్‌ విభాగం ఏర్పాటు చేసింది.

ఇక దేవాలయాల్లో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొన్నది. కాషాయ జెండాలు చేతబూని, కాలిఫోర్నియాలో 1100 మంది కార్ల ర్యాలీని చేపట్టారు. న్యూజెర్సీలో 350 కార్లతో పరేడ్‌ నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో జరగనున్న మ్యూజికల్‌ షోలో 100కుపైగా టెస్లా కార్లు పాల్గొంటున్నాయి. 21 నగరాల్లో టెస్లా కారు ర్యాలీలు జరగనున్నాయి. మారిషస్‌ జనాభాలో 48 శాతం హిందువులే. నేడు ఆ దేశంలోని ప్రభుత్వం, హిందూ ప్రభుత్వ అధికారులకు రెండు గంటల స్పెషల్‌ బ్రేక్‌ (విరామం)ప్రకటించింది. ‘బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన భారత్‌కు మాత్రమే కాదు, మారిషస్‌ ప్రజలకు కూడా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం’ అని ఆ దేశ హై కమిషనర్‌ డిల్లుమ్‌ తెలిపారు. అక్కడి హిందూ దేవాలయాల్లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించేందుకు భక్తులు సిద్ధమయ్యారు.ఇక ఫ్రాన్స్‌లో భారతీయులు ‘గ్రాండ్‌ రథయాత్ర’ను చేపట్టారు. పారిస్‌లోని డీ లాచాపెల్‌ వద్ద గణేశ్‌ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై, నగరంలోని ప్రముఖ ప్రదేశాల గుండా కొనసాగనున్నది. అయోధ్య వేడుకపై ఈఫిల్‌ టవర్‌ వద్ద లైవ్ ప్రసారాలు చేపట్టారు. 

Tags:    

Similar News