Fresh talks: మరోసారి రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం పిలుపు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-21 06:51 GMT

పంటకు కనీస మద్దతు ధరకై వారం రోజులుగా పోరాటం చేస్తున్న రైతు నేతలతో.. కేంద్ర మరోసారి చర్చలకు సిద్ధమైంది. రైతు సంఘాలతో చర్చలకు పిలుపునిస్తూ... శాంతిని కాపాడుకోవడం మనకు ముఖ్యమంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. రైతు నేతలను మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నామని, ఐదో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎంఎస్‌పీ డిమాండ్, పంటల వైవిధ్యం, ఎఫ్‌ఐఆర్‌ వంటి అన్ని అంశాలపై చర్చలకు రెడీగా ఉన్నామంటూ తెలిపారు. ఇప్పటికే రెండు వర్గాల మధ్య నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. మళ్లీ ఐదోసారి చర్చలకు పిలవడం చర్చనీయాంశమైంది.

మరో వైపు కేంద్రం తమ ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తున్నదని రైతులు ఆగ్రహిస్తున్నారు. మరోసారి ‘దిల్లీ చలో’ మార్చ్‌కు సన్నద్ధమవుతోన్న తరుణంలో.. పంజాబ్‌- హరియాణా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతుల డిమాండ్లపై బీజేపీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసే వ్యూహాలకు పాల్పడుతుందని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్ ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనేది మా ఉద్దేశం.. అని అన్నారు దల్లేవాల్. రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రైతులు ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా మధ్య సరిహద్దు పాయింట్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను దల్లేవాల్ ఖండించారు.

Tags:    

Similar News