Chhattisgarh High Court: భార్యపై అనుమానంతో ఫోన్ కాల్స్ రికార్డ్.. భర్తకు హైకోర్టు షాక్

Update: 2023-10-16 04:50 GMT

అవతలి వ్యక్తికి తెలీకుండా వారి కాల్స్ రికార్డ్ చేయడం ఆర్టికల్ 21 ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని చత్తీస్‌ఘడ్‌ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. విడాకులు భరణానికి సంబంధించిన ఓ కేసు విచారణలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో వెలుగుచూసిన కొత్తకోణంపై చర్చ మొదలైంది. సొంత భార్యాభర్తలైనా సరే ఒకరికి తెలియకుండా మరొకరి కాల్స్ రికార్డ్ చేయడం అనేది గోప్యత హక్కుకు పాతర వేయడమేనని కోర్టు స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాకు చెందిన ఓ మహిళ(38).. భర్త నుంచి మెయింటెనెన్స్ కోరుతూ 2019లో మహాసముండ్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయమై భార్యను రీఎగ్జామిన్ చేయాలని కోరుతూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య ఫోన్ కాల్ రికార్డ్స్‌లో ఆమె వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వివాహేతర సంబంధం కారణాన ఆమెకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ రికార్డింగ్ ఆధారంగా ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేసి భార్య ప్రవర్తన మంచిది కాదని నిరూపించాలనేది ఆ భర్త ప్రయత్నం. ఫ్యామిలీ కోర్టు కూడా ఇందుకు అనుమతించింది.

ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ ఆ మహిళ 2022లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయసూత్రాలకు మహిళ తరపు న్యాయవాది విరుద్ధమని వాదించారు. భార్యకు తెలీకుండా భర్త ఆమె ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, దీని ఆధారంగా రీఎగ్జామినింగ్‌కు అనుమతించలేమని స్పష్టం చేశారు. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో మహిళ తరపు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కింది కోర్టు ఆదేశాలను పక్కనబెడుతూ తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News