ముఖేష్ అంబానీ కొడుకు పెద్ద మనసు.. ఆ రాష్ట్రానికి 25కోట్ల సాయం..

By :  Krishna
Update: 2023-09-09 12:27 GMT

ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో భారీ నష్టం సంభవించింది. మరోవైపు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఆ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎం సహాయ నిధికి 25కోట్ల విరాళం అందజేశారు. అనంత్ అంబానీ తరుపున రిలయన్స్ ప్రతినిధులు ఈ సాయాన్ని ఉత్తరాఖండ్ సీఎంకు అందజేశారు.

ఈ మేరకు అనంత్ అంబానీ ఓ లేఖ రాశారు. ఈ సాయం ఉత్తరాఖండ్ ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు లేఖలో తెలిపారు. గత పదేళ్లుగా ఉత్తరాఖండ్ ప్రజలతో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘ఉత్తరాఖండ్ ప్రజలతో గత దశాబ్దం కాలంలో సంతోషాలు, దుఃఖాలతో లోతైన బంధాన్ని ఏర్పరుచుకున్నాం. భవిష్యత్తులోనూ ఈ రాష్ట్రానికి మా సాయం కొనసాగుతుంది’’ అని లేఖలో అనంత్ వివరించారు.

గతంలోనూ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్కు విరాళాలు అందించారు. 2020లో చార్ధామ్ దేవస్థానం బోర్డుకు ఆయన రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ. 5 కోట్లు విరాళం అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, బద్రీనాథ్ , కేదార్‌నాథ్ ఆలయ కమిటీలకు గత ఏడాది రూ. 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. కాగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా.. 52 మంది మరణించినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News