రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్ వచ్చింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ వ్యక్తి మెయిల్ పంపాడు. గతంలో మెయిల్ పంపిన షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచే ఈసారి కూడా మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 31, నవంబర్ 1న రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని చెప్పారు.
అక్టోబర్ 27న ముఖేష్ అంబానీకి తొలుత ఓ మెయిల్ వచ్చింది. రూ. 20 కోట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో ముఖేష్ అంబానీని చంపేస్తానని ఆగంతకుడు అందులో బెదిరించాడు. ఆ తర్వాత మరో రెండు మెయిల్స్ పంపాడు. తొలుత రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆగంతకుడు తర్వాత ఆ మొత్తాన్ని రూ.200 కోట్లు, రూ.400 కోట్లకు పెంచాడు. మెయిల్స్‌కు స్పందనలేకపోవడంతో ప్రతిసారీ ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.
ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతేడాది సైతం అంబానీకి ఇలాంటి బెదిరింపు వచ్చింది. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామని గుర్తు తెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు.