Paytm ఎఫెక్ట్‌.. ఇతర యాప్లకు పెరిగిన గిరాకీ

Byline :  Bharath
Update: 2024-02-06 13:49 GMT

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పై ఆర్బీఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేటీఎం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దన్న ఆర్బీఐ ఆదేశాల జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు రద్దు చేస్తామని ఆర్బీఐ ప్రకటించలేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లు, లావాదేవీలు తగ్గినా నిబంధనలు అనుసరించి ఆర్బీఐ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తుంది. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి 29 డెడ్ లైన్ ముగిసిన తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుకావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్ లకు మొగ్గుచూపిస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే (ఫిబ్రవరి 3) ఇతర పేమెంట్ యాప్స్ కు డిమాండ్ పెరిగిపోయింది.

ఫోన్‌ పే (PhonePe), బిమ్‌- యూపీఐ (BHIM-UPI), గూగుల్‌ పే (Google Pay) డౌన్‌లోడ్స్‌ భారీగా పెరిగిపోయాయి. ఫోన్ పేకు ఫిబ్రవరి 3న ఒక్కరోజే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. పోయిన వారంతో పోల్చితే ఇది 45 శాతం పెరిగిందని యాప్ ఫిగర్స్ సంస్థ తెలిపింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వతేదీ మధ్య ఈ మొత్తం 10.4లక్షల డౌన్ లోడ్స్ జరిగాయి. BHIM యాప్ ను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య 5.93లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. అదే క్రమంలో G PAYకు 3.95లక్షల ఆండ్రాయిడ్ డౌన్ లోడ్స్ జరిగాయి. తాజా గణాంకాల ప్రకారం జనవరి 31 నాటికి ప్లేస్టోర్ లో ఫోన్ పే బిజినెస్ యాప్ 188వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5న 33వ స్థానానికి చేరుకుంది. యాప్‌ స్టోర్‌లో (యాపిల్ డివైజ్) 227 నుంచి 72కి ఎగబాకింది.

Tags:    

Similar News