ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో ఆయనను ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిసా భారతి, ఆయన కూతురు సైతం విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆర్జేడీ శ్రేణులు పెద్దఎత్తున ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం ఈడీ విచారణకు తేజశ్వీ యాదవ్ హాజరుకానున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో వీరిద్దరినీ విచారణకు రావాలని ఈ నెల 19న ఈడీ నోటీసులు జారీ చేసింది.
బిహార్లో నిన్ననే కొత్త సర్కార్ కొలువుదీరింది. సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీతో జతకట్టారు. నిన్న కొత్త సర్కార్ కొలువుదీరగా ఇవాళ లాలూ ఈడీ విచారణకు హాజరుకావడం గమనార్హం. మరోవైపు రాహుల్ పాదయాత్ర సైతం ఇవాళ బిహార్లోకి ఎంటర్ అయ్యింది. కాగా కేంద్రం తీరుపై ఆర్జేడీ ఫైర్ అయ్యింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విపక్షాలపై ఈడీని ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈడీ దాడులకు తాము భయపడేది లేదని స్పష్టం చేసింది.
కాగా యూపీఏ ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో లాలూ కుటుంబసభ్యులు కొంతమంది దగ్గర భూములు తీసుకుని వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022లో సీబీఐ లాలూ, రబ్రీదేవి, తేజస్వీపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తేజస్వీ సన్నిహితుడైన అమిత్ కత్యాల్ను గతంలో ఈడీ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ వ్యవహారంలో 600కోట్లపైగా కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.