రైతు ఖాతాలో రూ.200 కోట్ల జమ.. కాపాడాలంటూ పీఎస్‌కు
హరియాణాకు చెందిన ఓ రైతు బ్యాంకు ఖాతాలో గురువారం ఉన్నట్టుండి రూ.200 కోట్ల డబ్బు డిపాజిట్ అయ్యాయన్న వార్త కలకలం రేపింది. దీంతో ఆ పేద రైతు.. తనను ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడి.. గ్రామస్థులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో తనకు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేశాడు. హరియాణాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గురువారం విక్రమ్ తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా అతడి ఖాతాలో రూ.200 కోట్లు జమ అయ్యాయని చెప్పాడు. గ్రామస్థుల సాయంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల వాదన మరోలా ఉంది. విక్రమ్ ఖాతాలో కేవలం రూ.60 వేలు మాత్రమే గుర్తించామని.. అతడు చెబుతున్నట్లుగా రూ.200 కోట్లు లేవని అంటున్నారు. అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో అకౌంట్లో ఎవరు డిపాజిట్ చేశారు, ఎందుకు చేశారు అనే వివరాలను బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు సహా ఇతర వివరాలను బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకుంటామని.. పూర్తి విచారణ తర్వాతే ఎంత మొత్తంలో సొమ్ము విక్రమ్ ఖాతాలో జమ అయిందో చెప్పగలమని బధ్రా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఎస్పీ విశాల్ కుమార్ తెలిపారు.