Jaishankar: మాల్దీవుల వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-16 02:05 GMT

భారత్‌-మాల్దీవుల(India-Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌(S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందన్న హామీ ఇవ్వలేమని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత్‌-మాల్దీవుల దౌత్యపరమైన వివాదంపై స్పందిస్తూ.. ప్రతిదేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని, మనకు మద్దతు ఇస్తుందని తాను గ్యారంటీ ఇవ్వలేనని చెప్పారు. విదేశి విధానాల్లో రాజకీయం.. రాజకీయమేనని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ క్రమంలో ఎన్నో విజయాలను కూడా సాధించామన్నారు.

మాల్దీవులతో నెలకొన్న వివాదం నేపథ్యంలో విదేశి ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా భారత్‌ ప్రయోజనాలను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నకు.. పొరుగు దేశం మొదటి ప్రాధాన్యం ఏంటో తెలుసుకొని దాని ప్రకారమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తామని సమాధానమిచ్చారు. గత పదేళ్ల కాలంలో భారత్‌.. మాల్దీవులతో పటిష్టమైన సంబంధాలను ఏర్పరిచిందని తెలిపారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మారిందని రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ అక్కడి ప్రజల్లో భారత్‌-మాల్దీవల మధ్య ఉన్న సంబంధాలపై మంచి అభిప్రాయమే ఉందని తెలిపారు. రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్‌పట్ల సానుకూల భావాలను కలిగి ఉంటారన్నారు. భారత్‌తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని చెప్పారు. తమ దేశం నుంచి భారత భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు(Maldives President Muizzu) ఆదివారం సూచించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించిన విషయం తెలిసిందే. 




Tags:    

Similar News