Sanatana Dharma: నేను ఏ మతానికి శత్రువు కాదు.. ఉదయనిధి స్టాలిన్

Byline :  Veerendra Prasad
Update: 2023-09-07 07:39 GMT

మణిపుర్ హింస, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే 'మోదీ అండ్ కో' సనాతన ధర్మం వ్యవహారాన్ని ఓ పావుగా వాడుకుంటోందని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. తాము ఏ మతానికీ శత్రువులం కాదన్న విషయం అందరికీ తెలుసని, కానీ.. మోదీ అండ్ కోకు ఇవేవీ తెలియవని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. సెప్టెంబర్​ 2న తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ కావాలనే వక్రీకరించిందని ఆరోపించారు. సనాతన ధర్మంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు ఉదయనిధి స్టాలిన్.




 

అసలు కేసులు పెట్టాల్సింది నేను..

'సామాజిక న్యాయం ఎప్పటికీ వర్థిల్లాలి' అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. పెరియార్, అన్న, కలైంజ్ఞర్, పెరసిరియార్ సిద్ధాంతాలు విజయవంతం అయ్యేలా చూసేందుకు అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆ ప్రకటనలో... "గత 9 ఏళ్లలో మీరు చేసినవన్నీ ఉత్తుత్తి హామీలే. ప్రజల సంక్షేమం కోసం మీరు అసలు ఏం చేశారు? అని ఇప్పుడు అందరూ ముక్తకంఠంతో నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు నా మాటలను వక్రీకరించారు. తమను తాము కాపాడుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా మార్చుకున్నారు. అసత్య వార్తల ఆధారంగా.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యకరం. గౌరవప్రదమైన పదవుల్లో ఉండి నాపై దుష్ప్రచారం చేసినందుకు అసలు నేనే వారిపై కేసులు పెట్టాలి. కానీ.. ఉనినికి నిలుపుకునేందుకు వారికి ఉన్న మార్గం ఇదేనని నాకు తెలుసు. అందుకే నేను అలా చేయలేదు." అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్.

ప్రజల అజ్ఞానమే వీరి మూలధనం

భారతదేశంలోని మణిపూర్లో తలెత్తిన ప్రశ్నలను ఎదుర్కోవడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారు. తన స్నేహితుడు అదానీతో కలిసి తిరుగుతున్నారు. ప్రజల అజ్ఞానమే వీరి నాటకీయ రాజకీయాలకు మూలధనం అన్నది నిజం. "మణిపుర్​ అల్లర్లలో 250 మంది ప్రజల హత్య, రూ.7.5లక్షల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీ అండ్ కో ఈ సనాతన ధర్మం అనే పావును వాడుకుంటున్నాయి." అని ఆరోపించారు. "కానీ.. మోదీ అండ్ కోకు ఇవేవీ తెలియవు. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వారు ఇలా నిందలు వేస్తున్నారు. కానీ.. వారిని చూస్తే బాధ కలుగుతుంది. గత 9ఏళ్లుగా మోదీ చేసింది ఏమీ లేదు. అప్పుడప్పుడు నోట్లు రద్దు చేస్తారు. పేదల గుడిసెలు కనిపించకుండా గోడలు కడతారు. పార్లమెంటుకు కొత్త భవనం కట్టి, అందులో సెంగోల్​ను ప్రతిష్ఠిస్తారు. దేశం పేరు మార్చి ఆడుకుంటారు. సరిహద్దుల్లో నిల్చుని తెల్లజెండా ఎగరేస్తారు" అని కౌంటర్స్ వేశారు.




Tags:    

Similar News