Sandeshkhali Case : సందేశ్‌ఖాలీ కేసు.. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు అరెస్ట్
వెస్ట్ బెంగాల్లోని సందేశ్ ఖాలీలో అరాచకాలకు పాల్పడుతున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నార్త్ 24పరగణాల జిల్లా మినాకాలోని ఓ ఇంట్లో ఉన్న అతడిని ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. సుమారు 55 రోజులుగా షాజహాన్ తప్పించుకుని తిరుగుతుండగా హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని బసీర్హత్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
కాగా జనవరి 5న రేషన్ అక్రమాలపై షాజహాన్ ఇంట్లో ఈడీ తనిఖీలకు వెళ్లింది. అయితే అధికారులపై షాజహాన్ అనుచరులు దాడులకు తెగబడ్డారు. అప్పటినుంచి షాజహాన్ కన్పించకుండా పోయాడు. అక్కడికి వెళ్లిన అధికారులకు షాజహాన్ అరాచకాలు తెలిశాయి. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ భూములను లాక్కుంటున్నారని స్థానికులు ఈడీ అధికారులకు తెలిపారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షాజహాన్ను అరెస్ట్ చేయాలని స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
అతడి అరెస్టుపై కోర్టు స్టే ఉందని టీఎంసీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో స్పందించిన హైకోర్టు షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని.. వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఇటు గవర్నర్ సైతం 72 గంటల్లోగా షాజహాన్ ను అరెస్ట్ చేయాలని మమతా బెనర్జీకి లేఖ రాశారు. లేకపోతే అందుకు కారణాలను తనకు తెలిపాలన్నారు. ఒక వేళ సీఎం సహా పోలీసులు స్పందించకపోతే తానే సందేశ్ ఖాలీకి వెళ్తానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.