Saraswati Devi statue : ఏసుక్రీస్తు రూపంలో సరస్వతిదేవి విగ్రహం..వీడియో వైరల్

Update: 2024-02-15 06:56 GMT

ఏసుక్రీస్తు రూపంలో సరస్వతిదేవి విగ్రహం ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. త్రిపురలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సరస్వతి విగ్రహ రూపం ఏసుక్రీస్తును పోలి ఉందనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహం చూసినవారంతా ఇదే మాట అనడంతో దానిపై త్రిపురలో వివాదం తలెత్తింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా ఈ వివాదంపై స్పందించారు.

సరస్వతి దేవిని క్రీస్తు రూపంలో తయారుచేసిన ఘటనపై త్రిపుర సీఎం విచారణకు ఆదేశించారు. త్రిపురలోని అగర్తల టౌన్ లిచ్చుబగన్ ప్రాంతంలో త్రిపుర ప్రభుత్వ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజ్ ఉంది. నిన్న వసంత పంచమి కావడంతో సరస్వతి దేవి విగ్రహానికి విద్యార్థులు పూజలు చేశారు. అయితే ఆ విగ్రహం ఏసుక్రీస్తు లాగా తయారు చేశారని అఖిల భారత విద్యార్థి విభాగ నాయకులు నిరసన తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయ సంస్కృతి, మత సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా విగ్రహం ఉందని విద్యార్థి సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం విగ్రహానికి చీర కట్టిందని, ఇలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిబాకర్ ఆచార్జీ అన్నారు. ఈ సందర్భంగా వెంటనే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఎం మాణిక్ సాహాను డిమాండ్ చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.

Tags:    

Similar News