మీకొక లెక్క, మిగతా రాష్ట్రాలకు ఒక లెక్కా?.. కేంద్రంపై సుప్రీం సీరియస్

Update: 2023-07-26 05:39 GMT

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వర్తించవా అంటూ నిలదీసింది. నాగాలాండ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది. “ఇతర పార్టీలు అధికారంలో ఉన్న తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. అదే మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండవు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోరు?” అని అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యానించింది. రిజర్వేషన్‌ అనేది రాజ్యాంగపరమైన హక్కు. మహిళల రిజర్వేషన్‌ కూడా అందులో భాగమే. వాటిని అమలు చేయకుండా ఎలా ఉంటారు?’ అని కేంద్రాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్యని, మహిళా రిజర్వేషన్ దాని ఆధారంగా ఉంటుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారో తమకు అర్ధంకాకుండా ఉందని జస్టిస్ ఎస్‌కె కౌల్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్య, ఆర్థిక, సామాజిక హోదాలో ఉన్నతంగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్ అని, ఆ కారణంగా మహిళలకు రిజర్వేషన్ నిరాకరించరాదని పేర్కొంది. ఈ విచారణ సందర్భంగా బీజేపీ కూటమి పాలనలో ఉన్న మణిపూర్‌ రాష్ట్రంలో హింస ప్రస్తావన కూడా వచ్చింది.

Tags:    

Similar News