Whatsapp Spam : పొరపాటున కూడా ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ను ఎత్తకండి
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త తరహా నేర విధానానికి తెర లేపుతున్నారు. తెలియని నెంబర్తో వీడియో కాల్స్ చేస్తూ ఫెస్ వీడియోలను తీసుకోని వాటిని అసభ్య వీడియోలకు మార్ఫ్ చేస్తూ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ తరహా నేరాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. విదేశి కోడ్స్ నంబర్ నుండి కాల్స్ చేస్తూ జనాల్ని ట్రాప్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు.
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాట్సప్, మెయిల్, సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ఎంతటి అప్రమత్తమైన చర్యలు చెపట్టిన
నేరగాళ్ల వలలో చిక్కుకొని చాలా మంది అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా +84, +62, +60తో మొదలయ్యే వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్తో ఎక్కువ మంది ట్రాప్లో చిక్కుకుంటున్నారు. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ISD నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్లతో పాటు ఇండియన్ కోడ్ ఉన్న నంబర్ల నుంచి వచ్చే తెలియని కాల్స్తో నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ రకమైన స్కామ్కు సంబంధించి, మీకు ఏదైనా తెలియని నంబర్ నుండి కాల్ వస్తే దానిని స్వీకరించవద్దని వాట్సాప్ తెలిపింది. కాల్ని తిరస్కరించిన తర్వాత, వెంటనే రిపోర్ట్ చేసి అలాంటి నంబర్ను బ్లాక్ చేయాలని సూచించింది. అంతే కాకుండా ఉద్యోగాల పేరుతో కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయని.. అలాంటి నంబర్లను బ్లాక్ చేయాలని పేర్కొంది. ఇటీవల వాట్సాప్ ఇలాంటి స్పామ్ కాల్స్ సంబంధించి 4.7 మిలియన్ ఖాతాలను బ్లాక్ చేసింది.