కేరళలో నిఫా వైరస్ కలకలం కొనసాగుతోంది. 10 రోజుల వ్యవధిలో వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోజికోడ్ జిల్లాలోని 7 పంచాయితీల్లోని పలు వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. జనం జాగ్రత్తగా ఉండాలన్న ప్రభుత్వం యంత్రాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.
నిఫా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలు, గవర్నమెంట్ ఆఫీసులు, బ్యాంకులను మూసివేసింది. కంటైన్మెంట్ జోన్లలోకి బయటివారెవరూ వెళ్లకుండా లోపల ఉన్నవారు బయటకు రాకుండా చూడాలని, పోలీసులతో పాటు స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిరాణా దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే తెరవనున్నారు. అయితే హాస్పిటళ్లు, మెడికల్ షాపులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
వ్యాధి గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతోందని అన్నారు. ఇప్పటి వరకు 140 మందికి టెస్ట్ చేసినట్లు ఆమె చెప్పారు. మరోవైపు నిఫా వైరస్ పై సీఎం పినరయి విజయన్ హై లెవల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడంతో పాటు మాస్క్, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.