తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నై సహా పలు నగరాల్లో శుక్రవారం నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. కుండపోత వర్షం కారణంగా చెన్నైలోని రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై వర్షపు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.