మొబైల్ వాడొద్దని తిట్టిన పేరెంట్స్.. కోపంలో యువతి ఏం చేసిందంటే..
మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు తిట్టడంతో ఓ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. పేరెంట్స్పై కోపంతో ఆత్మహత్యకు సిద్ధమైంది. మినీ నయాగారాగా పేరుగాంచిన చిత్రకూట్ వాటర్ ఫాల్ వద్దకు చేరుకుంది. అక్కడే ఉన్న పర్యటకులు ఆపే ప్రయత్నం చేసినా 100 అడుగుల పైనుంచి నీటిలోకి దూకేసింది. అయితే అదృష్టవశాత్తూ చావు నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చత్తీస్ఘడ్ బస్తర్ జిల్లాకు చెందిన శాంటో మౌర్య అనే వ్యక్తికి 18ఏండ్ల సరస్వతి మౌర్య అనే కూతురు ఉంది. చదువు పక్కనబెట్టి నిత్యం మొబైల్ లో తలమునకలవుతున్న కూతురిని చూసి తల్లిదండ్రులు చాలాసార్లు మందలించారు. మంగళవారం మధ్యాహ్నం సైతం సరస్వతి మొబైల్ లో గేమ్స్ ఆడటాన్ని గమనించిన పేరెంట్స్ తిట్టారు. దీంతో సదరు యువతికి కోపం వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
సరస్వతి మంగళవారం సాయంత్రం దగ్గరలోని చిత్రకూట్ జలపాతం వద్దకు చేరుకుంది. కొండ అంచున నిలబడటంతో వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. అయినా వెనక్కి తగ్గని యువతి 100 అడుగుల పైనుంచి జలపాతంలోకి దూకేసింది. దీంతో అక్కడ కలకలం రేగింది. కొందరు యువకులు ఈ ఘటననంతా వీడియో తీశారు.
నీళ్లలోకి దూకిన యువతి చనిపోయి ఉంటుందని అంతా భావించారు. అయితే అప్పుడే ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జలపాతంలోకి దూకిన సరస్వతి ఆ తర్వాత ఈత కొడుతూ నీటి నుంచి సురక్షితంగా బయటకు వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన విషయం తెలుసుకుని మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు.