Delhi : ఢిల్లీలో నెలరోజుల పాటు 144 సెక్షన్..ఆ వస్తువులపై నిషేధం

Update: 2024-02-13 01:26 GMT

గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేయడానికి సిద్దమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులు నిరసన తెలుపడం బీజేపీ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఢిల్లీ సరిహద్దుల నుంచి మెగా మార్చ్ నిర్వహించి నిరసన తెలియజేస్తామని రైతులు నిర్ణయించారు. ఈ తరుణంలో రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలకు సిద్ధమైంది.

నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 12వ తేది వరకూ గట్టి బందోబస్తు మధ్య ఢిల్లీ ఉండనుంది. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అక్కడున్న సరిహద్దులను సర్కార్ మూసివేసింది. ఇంకొన్ని సరిహద్దుల వద్ద కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. శాంతి, భద్రతల సమస్యలు తలెత్తకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలోని సింఘూ, ఘాజీపూర్, టిక్రి ప్రాంతాల వద్ద భారీగా బలగాలను మోహరించింది. ఆ ప్రాంతాల్లో 5 వేల కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది. తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటివి దేశ రాజధానిలోకి తీసుకురాకూడదని వాటిపై నిషేధం విధించింది. అలాగే లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు పెట్టింది.


Tags:    

Similar News