సీమా హైదర్.. పబ్జీ ప్రేమ కోసం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి సెలబ్రిటీగా మారింది. పబ్జీ ఆటతో సీమా - సచిన్ పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త దేశాలు దాటేలా చేసింది. ప్రస్తుతం సీమా ఓ సినిమాలో నటిస్తోంది. సీమా హైదర్ ప్రేమ కథతో బాలీవుడ్ నిర్మాత అమిత్ జాని కరాచీ టు నోయిడా అనే మూవీ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సీమా నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు బెదిరింపులు షురూ అయ్యాయి.
సీమా హైదర్ బాలివుడ్ సినిమాలో నటించడంపై రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన స్పందించింది. ఈ సినిమా నుంచి తప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేత అమేయ కోప్కర్ హెచ్చరించారు. భారత సినీ పరిశ్రమలో పాకిస్తాన్ పౌరులకు స్థానం లేదని అన్నారు. సినిమా నాటకానికి తక్షణమే ముగింపు పలకాలని స్పష్టం చేశారు. లేకపోతే ఎంఎన్ఎస్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు.
‘‘పాక్ నుంచి వచ్చిన సీమా హైదర్ ప్రస్తుతం భారత్‌లోనే ఉంటోంది. ఆమె ఐఎస్‌ఐ ఏజెంట్ అని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. సినీరంగంలో తమ పేరు మార్మోగిపోవాలనే ఉద్దేశంతో కొందరు నిర్మాతలు ఆమెను నటిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి కాస్తయినా సిగ్గుండాలి. ఈ సినిమా నుంచి ఆమె వెంటనే తప్పుకోవాలి. లేకపోతే మా చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని అమేయ ట్వీట్ చేశారు.