అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. అది తీరం దిశగా కదులుతుండటంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో ఫైట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేయగా.. చాలా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ముంబై ఎయిర్ పోర్టులో వేలాది మంది ఫ్లైట్ల కోసం ఎదురుచూస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుండటంతో నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పరిస్థితి దారుణంగా మారింది. గంటల తరబడి పడిగాపులు పడుతున్నా విమానయాన సంస్థలు తమను పట్టించుకోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. కనీసం కూర్చునేందుకు జాగా కూడా లేదని అంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై మండిపడుతూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే విమానాల రాకపోకలపై ఎయిరిండియా అర్ధరాత్రి ట్విటర్‌లో అప్‌డేట్ ఇచ్చింది. వాతావరణం అనుకూలంగా లేనందున ముంబై ఎయిర్‌పోర్టులోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారని చెప్పింది. ఫలితంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్ని రద్దయ్యాయని వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించింది. అటు ఇండిగో సైతం తప్పనిసరి పరిస్థితుల్లోనే విమానాలు ఆలస్యమవుతున్నాయని చెప్పింది.
మరోవైపు బిపోర్‌జాయ్ తుఫాను గుజరాత్‌లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15వ తేదీన తీరాన్ని దాటనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గంటలకు 8 కి.మీల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు చెప్పింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కచ్, సౌరాష్ట్రలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున జూన్ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు.