మోడీ కేబినెట్లోకి శరద్ పవార్.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, అజిత్ పవార్తో భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ప్రధాని నరేంద్రమోడీ శరద్ పవర్కు మంత్రి పదవి ఆఫర్ చేశారని, దీనికి సంబంధించి అజిత్ పవార్ తో రాయబారం నడుపుతున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇండియా కూటమిని చెల్లాచెదురు చేసేందుకు అజిత్ నేతృత్వంలో బీజేపీ వ్యూహం అమలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శనివారం పూణెలోని ఓ బిజినెస్ మేన్ ఇంట్లో శరద్ పవార్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. అజిత్ వర్గం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో భాగస్వామి అయిన నెల రోజల తర్వాత వారిద్ధరూ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ముంబైలో ఈ నెలాఖరున ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్ అయింది. శరద్ పవార్ కు కేంద్ర కేబినెట్లో బెర్త్ ఇచ్చి ప్రతిపక్ష కూటమిని చెల్లాచెదురుచేసే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అజిత్ పవార్ తో గేమ్ ఆడిస్తోందన్న వినిపిస్తున్నాయి.
మోడీ మంత్రి పదవి ఆఫర్ చేశారన్న పుకార్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శరద్ పవార్ స్పందించారు. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు.
అజిత్ పవార్తో భేటీ అయిన విషయం వాస్తవమేనన్న ఆయన.. కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు చెప్పారు. అంతేతప్ప మంత్రి పదవి ఆఫర్ చేశారంటూ వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్టీ పెద్ద అయిన తనకు ఎవరు ఏ ఆఫర్ ఇవ్వగలరని అన్నారు.
ఇదిలా ఉంటే ఆగస్టు 31న ఇండియా కూటమి సమావేశం ముంబైలో జరగనుంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా భేటీ యథావిధిగా జరుగుతుందని శరద్ పవార్ స్పష్టం చేశారు.