సీనియర్ నటికి జయప్రద అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను నిలిపివేయాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టుకు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ని జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 6వ తేదిలోపు జయప్రదను అరెస్ట్ చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసారి జయప్రద అరెస్ట్ కచ్చితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
2019 రాంపూర్ లోక్‌సభ ఎన్నికలలో జయప్రద బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆమె ఓ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీంతో జయప్రదపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. జయప్రదను కోర్టు విచారణకు రావాలాంటూ ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆమె హాజరు కాలేదు. దీంతో రాంపూర్ కోర్టు జయప్రదని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
కోర్టు వారెంట్‌ను సవాల్ చేస్తూ జయప్రద తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం దానిని కొట్టివేసింది. మార్చి 6వ తేదిలోపు జయప్రదను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే జయప్రద రాజేంద్ర ప్రసాద్ సరసన 'లవ్@65' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని మేకర్స్ ప్రకటించనున్నారు.