ఇండియా కూటమికి మరో షాక్..ఒంటరిగా బరిలోకి ఫరూక్ అబ్దుల్లా

By :  Vamshi
Update: 2024-02-15 12:22 GMT

ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటి చేస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని 5 స్ధానాల్లో తమ పార్టీ అభ్యర్థులే బరిలో ఉంటారని తెలిపింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఒంటరిగా పోటి చేస్తామని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని మోదీ సర్కార్‌కి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఒక్కొక్క పార్టీ కూటమి నుంచి వైదొలుగుతున్నాయి. ఇప్పటికే కూటమిలో ప్రధాన పార్టీలు కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నాయి.

ఇటీవల మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు హస్తం పార్టీకి షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. ఆయన దారిలో పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ కూడా కూటమిని విస్మరించి లోక్ సభ ఎన్నికలపై గురి పెట్టింది. తాజాగా కూటమికి మరో మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తన నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అబ్దుల్లాకు సమన్లు ​​జారీ చేసింది. సంబంధం లేని పార్టీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం, అసోసియేషన్ ఖాతాల నుండి వివరించలేని నగదు ఉపసంహరణల ద్వారా నిధులను స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. అయితే అబ్దుల్లా సమన్లను దాటవేశారు. జమ్మూ కశ్మీర్‌లో పొత్తు ఉండబోదని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ప్రతి పార్టీకి వారి స్వంత పరిమితులు ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. అలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’ అని ఆయన వెల్లడించారు.


Tags:    

Similar News