బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది. నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచి, ఓ ఇంటిదాన్ని చేసిన తల్లినే అత్యంత దారుణంగా హతమార్చింది కన్న కూతురు. అమ్మను చంపడమే కాదు ఆపైన ఆమె శవాన్ని ఓ సూట్ కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని పోలీసులు ఆరా తీయగా నిందితురాలు చెప్పిన విషయాలు వింటే మాత్రం అందరూ భయపడాల్సిందే.
కొల్‌కతాకు చెందిన సొనాలీ సేన్ పెళ్లి తరువాత తన భర్త , కుమారుడు, అత్త, తల్లితో కలిసి బెంగళూరులో ఉంటోంది. వీరంతా ఒకే ఫ్లాట్‌లో గత కొంత కాలంగా ఉంటున్నారు. సోనాలి బర్త ఓ సాప్ట్వేర్ ఇంజనీర్. సోమవారం ఉదయం సోనాలీ సేన్ తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆ మత్తులోనూ తీవ్రమైన కడుపునొప్పితో సోనాలి తల్లి విలవిలలాడింది. తల్లి బాధను చూసి అయ్యో పాపం అని అనాల్సింది పోయి, సోనాలి దారుణానికి ఒడిగట్టింది. తల్లి ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి ఆమెను దారుణంగా చంపేసింది. ఈ తర్వాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన తల్లిని తానే చంపినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. విచారణలో ఆమె చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు.
సోనాలి భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ దారుణం జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేడు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ హత్య భర్తకు వివరించగా అతను షాక్ అయ్యాడు. విచారణలో కూతురు తన తల్లే తనను చంపేయమని కోరిందని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఇది విని పోలీసులు నిర్ఘాంతపోయారు. ఇదే క్రమంలో ఈ హత్య కేసులో మరో కోణం ఉందంటున్నారు పోలీసు బాసులు. సోనాలీ అమ్మ..తన అత్తతో నిత్యం గొడవ పడుతోందని, ఈ విషయంలో విసిగిపోయిన సోనాలీ.. ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సోనాలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.