Vande Bharat Express: వందేభారత్లో కంపు భోజనం.. డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రయాణికుల డిమాండ్

By :  Bharath
Update: 2024-01-11 15:27 GMT

సాధారణ రైళ్లతో పోల్చితే వందేభారత్ రైళ్లలో టికెట్ ధరలు కాస్త ఎక్కువే. అయితే తొందరగా గమ్యానికి చేరతామని, నాణ్యమైన క్యాటరింగ్ సదుపాయం ఉంటుందని చాలామంది ఇందులో ప్రయాణిస్తుంటారు. కానీ ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ట్రైన్ లో.. ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. రైల్వే క్యాటరింగ్ తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా.. దుర్వాసన వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు ఆదోళనకు దిగాడు. ఆ ఫుడ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇండియన్ రైల్వేస్, వందేభారత్ ఎక్స్ ప్రెస్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను ట్యాగ్ చేశాడు.

భోజనం సరిగా లేనందుకు ఆ మొత్తానికి అయిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. క్యాటరింగ్ సర్వీస్ వారు నాణ్యత లేని ఆహారం పెట్టి వందేభారత్ పరువు తీస్తున్నారని తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. రైల్వే సేవ స్పందించింది. రైల్ మదద్ పోర్టల్ లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపింది. సంబంధిత ప్రయాణికుడి పీఎన్ఆర్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎస్ఎంఎస్ చేయాలని కోరింది. ఈ పోస్ట్ పై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కూడా స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంబంధిత క్యాటర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.



Tags:    

Similar News