మణిపూర్‌లో ఆగని హింస.. ఆర్మీ జవాన్‌ను కిడ్నాప్ చేసి హత్య
దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచెయ్యని ఆ పోరాటయోధుడు.. తన కుటుంబ సభ్యులని చూడాలని సెలవు తీసుకుని వచ్చాడు. ఇంటికి రావడమే ఆ ఆర్మీ జవాన్ పాలిట శాపమైంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి జవాన్‌ను కిడ్నాప్ చేసి.. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డారు. మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని తరుంగ్ ప్రాంతానికి చెందిన సెర్టో తంగ్తాంగ్ కోమ్(41) దేశ రక్షణలో బాధ్యత వహిస్తున్న సైనికుడు. ఇటీవలె విధులకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు.. కోమ్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. అనంతరం అతడ్ని దారుణంగా కొట్టి కిడ్నాప్ చేశారని సెర్టో తంగ్తాంగ్ కోమ్.. 10 ఏళ్ల కొడుకు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కోమ్‌ను వెతికే పనిలో పడ్డారు. ఎంతకీ అతని ఆచూకీ లభించలేదు. కానీ ఖునింగ్‌థెక్ గ్రామ పరిధిలో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జవాన్ కోమ్.. విగతజీవిగా పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అతడి తలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని వారు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వివరించారు. మృతుడు సెర్టో తంగ్తాంగ్ కోమ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.