Sonia Gandhi : సోనియా గాంధీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ బరిలో నిలిచారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్ వేశారు. గత 25ఏళ్లుగా లోక్ సభ ఎంపీగా ఉన్న ఆమె ఫస్ట్ టైం పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో తన అఫిడవిట్లో ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆమె సమర్పించారు. ఆ అఫడవిట్ ప్రకారం సోనియాకు రూ.12.53 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2014తో పోలిస్తే ఆమె ఆస్తులు మూడున్నర కోట్లు పెరిగాయి. 2014లో ఆమె ఆస్తులు రూ.9.28 కోట్లు ఉండగా.. 2019లో రూ.11.82 కోట్లకు పెరిగాయి.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులుగా ఆమె ఆస్తులు రూ.6.38కోట్లు ఉన్నాయి. వీటితోపాటు తన ఎంపీ జీతమే తన ఆదాయ వనరని అఫిడవిట్లో తెలిపారు. ఇక కోటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా తన సొంత దేశమైన ఇటలీలో తనకు ఓ ఇల్లు ఉందని.. దీన్ని విలువ దాదాపు 27 లక్షలు ఉంటుందని వివరించారు. ఇక ఎలాంటి క్రిమినల్ కేసులోనూ తను దోషీగా తేలలేదని తెలిపారు. అదేవిధంగా తనకు ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సోనియా రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రియాంక పోటీచేస్తే ఇవే ఆమెకు తొలి ఎన్నికలు కానున్నాయి. దశాబ్దాలుగా సోనియా రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాహుల్ గాంధీ సైతం పలు దఫాలుగా పోటీ చేసిన యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. అయితే సోనియా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ సమయంలోనే ఇవే తన చివరి ప్రత్యక్ష ఎన్నికలు అని ఆమె ప్రకటించారు.