అయోధ్య కత్తెరలో ఇరుక్కున్న సోనియా పోయినా నష్టమే.. పోకపోయినా నష్టమే!
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమెకు ఓ గడ్డు సమస్య ‘అయోధ్య’ రూపంలో వచ్చిపడింది. ఆమె మాత్రమే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ.. కిం కర్తవ్యవని తల పట్టుకుంటున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభానికి హాజరు కావాలని అయోధ్య ఆలయ ట్రస్ట్ సోనియా గాంధీని ఆహ్వానించింది. ఆమెతోపాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ఆ పార్టీ అధీర్ రంజన్ చౌదరి తదితులకు కూడా ఆహ్వానాలు పంపింది. సోనియా ఆ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమె ఆహ్వానంపై అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆమె అయోధ్యకు వెళ్తారా, వెళ్లరా అనే సస్పెన్స్ నెలకొంది.
సోనియా రామాలయ ప్రారంభానికి వెళ్లినా, వెళ్లపోయినా కాంగ్రెస్ పార్టీకి నష్టమే. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సోనియా అయోధ్యకు వెళ్తే కాంగ్రెస్ హిందూత్వానికి అనుకూలమే సంకేతాలు వెళ్తాయి. మైనారిటీ ఓటర్లు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ‘సెక్యులరిస్ట్’ ఇమేజీ ఉన్న కాంగ్రెస్ ‘అతివాద హిందుత్వ’ పార్టీ అయిన బీజేపీని గద్దె దించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సోనియా హిందుత్వ రాజకీయాలకు కేంద్రమైన అయోధ్య రాముడి గుడికి వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతాయని కాంగ్రెస్ పెద్దలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీనే అని మైనారిటీలు ఆశలు పెట్టుకున్నారని, సోనియా అయోధ్యకు వెళ్లి వాటిని భంగం కలిగించరని చెబుతున్నారు. అయోధ్యలో కాషాయ జెండా రెపరెపల మధ్య మోదీ, అద్వానీ తదితరుల పక్కన సోనియా గాంధీని ఊహించుకోవడం కాంగ్రెస్ శ్రేణులకు జీర్ణమయ్యే అంశం కాదు. సోనియా హాజరైతే కాంగ్రెస్ కూడా కాషాయం తానులో ముక్కలేనని ప్రజలు భావిస్తారని, ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుదని పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి.
ఈ భయాలను దృష్టిలో ఉంచుకుని సోనియా అయోధ్యకు వెళ్లకపోవచ్చే వాదనలు వినిస్తున్నాయి. ఆమె ఆలయ ట్రస్ట్ ఆహ్వానంపై ఆచితూచి స్పందిస్తారని, సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సోనియా అయోధ్యకు వెళ్లకపోతే హిందువులకు వ్యతిరేకమనే తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని, ఎన్నికల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే భయం కూడా హస్తం పార్టీని వేధిస్తోంది. అయోధ్య వివాదం ముగిసి ఆలయం నిర్మాణం పూర్తయినా బీజేపీ రాముడి పేరుతో హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయత్నిసోంది. ఈ నేపథ్యంలో సోనియా, ఇతర కాంగ్రెస్ నేతలు అయోధ్య పోగ్రామ్‌కు వెళ్లకపోతే హిందూ వ్యతిరేకులనే ముద్ర మరింత బలంగా పడుతుంది. లోక్ సభ ఎన్నికల్లో మోదీకి అదో ఆయుధంగా మారుతుంది. విదేశీయులకు హిందువుల మనోభావాలపై గౌరవం లేదని దాడి చేసే అవకాశం ఉంటుంది. సోనియా క్రైస్తవురాలని, ఇటలీ కేథలిక్కు అని పాత చింతకాయ పచ్చడి విమర్శలను తెరపైకి తీసుకొస్తారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను ఈ విమర్శలు ఇబ్బందిపెట్టేవే. ‘భారత్ జోడో’ అంటూ పాదయాత్రలో గుళ్లూ గోపురాలు తిరుగుతున్న రాహుల్ గాంధీకి కూడా ‘అయోధ్య ఆహ్వానం’ చావో రేవో అన్న సమస్యగా మారింది.
అయోధ్యకు పోయినా, పోకున్నా నష్టం జరుగుతుందని, ఇది సున్నితంగా వ్యవహరించాల్సిన విషయమని సోనియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హాజరు కాకపోతే సందేశాన్ని పంపే అకాశముందని భావిస్తున్నారు. లేకపోతే అనారోగ్యం వంటి సాకులను కూడా చూపొచ్చని చెబుతున్నారు. సోనియా నిజానికి ఆలయాలకు, సంప్రదాయాలకు దూరంగా కాదు. తను మతం హిందూమతమేనని ఆమె చాలాసార్లు చెప్పారు. 1990లలో తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు తనకు హిందూమతంపై విశ్వాసం ఉందని అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఆమె క్రైస్తవురాలు కనుక ఆలయానికి రావొద్దని అప్పట్లో నిరసనలు జరిగాయి. ‘నా భర్త, నా అత్త పాటించే మతాన్నే నేనూ పాటిస్తున్నా’ అని ఆమె అప్పట్లో అఫిడవిట్లో రాశారు. భారతదేశంలో లౌకికత్వానికి హిందూమతం హామీ ఇస్తుందని తర్వాత కాంగ్రెస్ కూడా ప్రకటించింది.
సోనియా కట్టుబొట్టులో హిందుత్వాన్ని పాటిస్తుంటారు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె హిందూ ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. కుంభమేళాలో పుణ్యం స్నానం చేశారు. హిందూమతంతో ఇంతగా మకేకమైనప్పటికీ ఆమె ఇటాలియన్ క్రైస్తవురాలేనని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపుతున్న అయోధ్య రామాలయ ట్రస్టీలు సోనియాకు ఆహ్వానం పంపడం యాదృచ్ఛికమే. ఈ గండాన్ని కాంగ్రెస్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి.