పార్లమెంటు స్పెషల్ సెషన్ సందర్భంగా ఎంపీలు తొలిసారి కొత్త బిల్డింగ్లో అడుగుపెట్టనున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పార్లమెంటు ఉభయ సభలు కొత్త భవనంలో కొలువుదీరనున్నారు. ఈ సందర్భానికి గుర్తుగా కేంద్రం పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక కానుక అందజేయనుంది. ఆ బహుమతులకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎంపీలకు అందించే ప్రత్యేక బ్యాగులను జనపనారతో తయారు చేశారు. అందులో భారత రాజ్యాంగ ప్రతితో పాటు పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం, పార్లమెంటు హౌస్ సీల్తో పాటు మరికొన్ని వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు కూడా ముద్రించినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు పాత భవనంలో ఫొటో సెషన్ ముగిసిన అనంతరం సభ్యులంతా కొత్త బిల్డింగులోకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజ్యాంగ ప్రతిని కొత్త పార్లమెంటు భవనంలోకి తీసుకెళ్లనున్నారు.