టీచర్ బదిలీ...స్కూల్‌కు తాళం వేసి విద్యార్థుల ఏడుపు..

Update: 2023-06-25 14:03 GMT

ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలు సరిగా లేని రోజులివి. దీనికి ఉపాధ్యాయుల, విద్యార్థుల ప్రవర్తనే కారణం. గురువుని దైవంగా కొలిచే రోజులు పోయాయి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ పిల్లలగా భావించి తీర్చిదిద్ది స్థితి నుంచి ఏదో తమ పాఠాలు చెప్పుకొని వెళ్లే రోజులు వచ్చేశాయి. బోధన సరిగా చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న టీచర్లు కూడా మనం చూస్తున్నాం. కానీ అక్కడక్కడ మంచి గురువులు ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం.




 


తమకు ఇష్టమైన టీచర్ బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. స్కూల్ వదిలి వెళ్లొద్దంటూ గగ్గోలు పెట్టారు. 'మమ్మల్ని వదలి వెళ్లొద్దు' అంటూ ఏడుస్తూ బతిమాలారు. విద్యార్థులు తల్లిదండ్రులు సైతం ఆ ఉపాధ్యాయులు ఇక్కడే ఉండాలని పట్టుబట్టి.. బదిలీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బదిలీ నిలిపివేసే వరకు పాఠశాల తెరవబోమని తేల్చి చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కుమట మండలంలోని ఉప్పినపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంధ్యా రైకర్​ అనే ఉపాధ్యాయురాలు 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె విద్యార్థులకు చక్కగా బోధనలు చేసి.. మంచిగా చూసుకోవడంతో పిల్లలకు, గ్రామస్తులకు బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఆమెను మరో పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు ఏడ్చేశారు. ఉపాధ్యాయురాలి​ బదిలీని నిరసిస్తూ.. స్కూల్​కు తాళం వేశారు. టీచర్​ను మళ్లీ అదే పాఠశాలలో నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఓ స్థానికనాయకుడు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడతానని..మళ్లీ ఇక్కడే ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News