Seema Haider: ఇండియా-పాక్ బోర్డర్‌పై ప్రశ్న... వైరల్‌గా పిల్లాడి ఆన్సర్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-25 05:21 GMT

ప్రేమ వ్యవహారం నేపథ్యంలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ (Seema Haider) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ప్రేమగా మారి అతడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలతో సహా ఇండియా వచ్చేసింది సీమా. ఈ క్రమంలోనే అతణ్ని పెళ్లాడి కొన్ని నెలలుగా కాపురం చేస్తోంది. అయితే సీమా పాక్ గూఢచారిణి కావొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆ కోణంలో ఇప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణం సీమా హైదర్ అని ఓ పిల్లాడు పరీక్షలో రాసిన సమాధానం.. ఒక్కసారిగా వైరల్ అవుతోంది.

రాజస్థాన్ ధో‌ల్‌పూర్ జిల్లాలోని ఓ పాఠశాల పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో భారత్ పాక్ సరిహద్దు వివాదంపై ఓ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు ఓ విద్యార్థి చిత్రమైన సమాధానం రాశాడు. ‘‘భారత్ - పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై లంబే బతావో..? (భారత్ పాకిస్తాన్ మధ్య ఏ సరిహద్దు ఉంది.. దాని పొడవు చెప్పండి?)’’ అనే ప్రశ్న పరీక్షలో వచ్చింది. దీనికి సదరు విద్యార్థి ఏకంగా ‘సీమ’(సరిహద్దు)ని కాస్త ‘‘సీమా హైదర్’’గా పొరబడ్డాడు. ఇక తనకు తెలిసిన ఆన్సర్ రాసేశాడు. "దోనో దేశోం కే బీచ్ సీమా హైదర్ హై. ఉస్కీ లంబై 5 అడుగుల 6 అంగుళాల హై. దోనో దేశోం కే బీచ్ ఇస్కో లేకర్ లడాయి హై(భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సరిహద్దు పేరు సీమా హైదర్. ఆమె పొడవు 5 అడుగుల 6 అంగుళాలు. ఆమె గురించి రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి)`` అని రాశాడు. ఈ జవాబు పత్రాన్ని చూసిన టీచర్‌ నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral) అవడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News