Dwarka Submarine Darshan: సముద్ర గర్భంలోని ద్వారకను వీక్షించొచ్చు.. ఎలాగంటే..
దేశంలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో ద్వారక నగరాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలగర్భంలో ఈ మహా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లడం లేదు. అయితే ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులు, భక్తులు ద్వారకా నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి(సబ్ మెరైన్) సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘మజ్‌గావ్ డాక్’ షిప్‌యార్డ్ కంపెనీతో బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్‌మెరైన్ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది. పర్యాటకులను సబ్‌మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే మొదటిసారిగా ప్రభుత్వం చెప్పింది.
సబ్‌మెరైన్ నుంచి అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను భక్తులు తిలకించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహించనున్నామని పేర్కొన్నది. ఈ జలాంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారని వెల్లడించారు. జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుందని తెలిపారు. అక్కడ నుంచి యాత్రికులు పురాతన నగరం శిథిలాలే కాకుండా అరుదైన సముద్ర జీవులను కూడా చూడగలరని వివరించారు. ఈ జలాంతర్గామి సేవలతో గుజరాత్‌లో పర్యాటకం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.