'నా పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారు'.. సుధామూర్తి
తన పేరు చెప్పుకొని ఇద్దరు మహిళలు.. అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న పేరును దుర్వినియోగం చేస్తూ.. జనాలను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయానికొస్తే.. అమెరికాలో (America) జరిగే ఈవెంట్లకు సుధామూర్తి హాజరవుతారని పేర్కొంటూ కొందరు డబ్బులు వసూలు చేశారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం సుధామూర్తి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె సీరియస్‌గా స్పందించి.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమత సంజయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసినట్టు సమాచారం.
ఫిర్యాదు ప్రకారం.. ఉత్తర కాలిఫోర్నియా (కెకెఎన్‌సి) కన్నడ కూట 50వ వార్షికోత్సవానికి హాజరు కావాలని సుధా మూర్తిని ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆమె కార్యాలయానికి ఇమెయిల్ ఆహ్వానం అందింది. అయితే..తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాలేనని ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. అయినప్పటికీ..సుధా మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తప్పుడు ప్రచారం నిర్వహించారు ఆ కార్యక్రమ నిర్వహకులు. ఈ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చూసిన సుధామూర్తి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ విషయమై KKNC నిర్వాహకులను సంప్రదించగా.. తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పినట్టు లావణ్య అనే మహిళ మోసం చేసినట్టు గుర్తించారు.
మరో సంఘటనలో.. సుధా మూర్తి USAలో ఒక కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంటూ శ్రుతి అనే మహిళ నిర్వహకుల నుండి 40 డాలర్లు వసూలు చేసింది. సెప్టెంబర్ 26న 'డాక్టర్ సుధా మూర్తితో మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారు అనే ప్రకటనను సుధామూర్తి టీమ్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు.