బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సరెండర్ అయ్యేందుకు మరింత సమయం కావాలంటూ వారు వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. వాటికి విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. ఆదివారం నాటికి నిందితులు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఇటీవలే 11 మంది నిందితుల క్షమాభిక్షను రద్దు చేసింది. నిందితులకు క్షమాభిక్ష ఇచ్చే అధికారం గుజరాత్ సర్కార్కు లేదని స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా నిందితులు లొంగిపోవాలని అప్పుడు ఆదేశించింది. అయితే లొంగిపోవడానికి సమయం కావాలని నిందితులు సుప్రీంను ఆశ్రయించారు.
తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు టైం ఇవ్వాలంటూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కొడుకు పెళ్లి చేయాలని, పంటలు కోతకు వచ్చాయని అందుకే లొంగిపోయేందుకు కాస్త సమయం కావాలని పిటిషన్లో విన్నవించారు. అయితే వారి అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆదివారం లోపు లొంగిపోవాలని స్పష్టం చేసింది. కాగా అగస్ట్ 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని కొంతమంది ఊచ కోత కోశారు. ఈ కేసులోని 11మంది నిందితులకు మరణశిక్ష పడగా.. తర్వాత అది యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గుజరాత్ సర్కార్ నిందితుల 14ఏళ్ల శిక్షా కాలం పూర్తవ్వగానే నిందితులను విడుదల చేసింది. దీనిపై బిల్కిస్ బానో సహా టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వంటి వారు సుప్రీంలో సవాల్ చేశారు.
ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు? ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు? వీళ్లు మాత్రమే సత్ప్రవర్తన కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. బిల్కిస్ బానో కేసులో దోషులపై సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ కేసు విచారణను గోద్రా కోర్టు నిర్వహించనప్పుడు, దోషుల విడుదల విషయంలో ఆ కోర్టు అభిప్రాయాన్ని ఎందుకు తీసుకున్నారని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది. నిందితులు చేసింది దారుణమైన నేరమే అయినప్పటికీ.. అరుదైనది కాదని గుజరాత్ సర్కార్ కోర్టుకు తెలిపింది. శిక్ష తగ్గింపుపై రాష్ట్రానికొక విధానం ఉంటుందని, వాటిపై ఉత్పన్నమయ్యే ప్రశ్నలను ఒక రాష్ట్రాన్ని కాకుండా అన్ని రాష్ట్రాలనూ అడగాల్సి ఉంటుందని ఏఎస్‌జీ బదులిచ్చారు. ఇక్కడ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అందరికీ ఒకే విధానాన్ని అనురిస్తోందా? లేదా? అన్నదే ప్రశ్న అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.