Governor Ravi : ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో తప్పులు.. తమిళనాడు గవర్నర్

Update: 2024-02-12 06:37 GMT

తమిళనాడులో ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఆనవాయితీ ప్రకారం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావాల్సిన సమావేశాలు.. మొదటిరోజే రసాభాసాగా మారాయి. సమావేశాలను ప్రారంభించాల్సిన ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే పూర్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను పక్కన పెట్టి, చదవనని స్పష్టం చేశారు. ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర, అంగీకారయోగ్యం కాని మాటలు ఉన్నాయని తేల్చి చెప్పారు. దీంతో గవర్నర్‌కి బదులుగా స్పీకర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదవాల్సి వచ్చింది. ఫలితంగా...మరోసారి అసెంబ్లీలో అలజడి రేగింది.

"నా ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించాలని చాలా సార్లు నేనుప్రభుత్వానికి సూచించాను. కానీ వాళ్లు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని అభ్యంతకరమైన విషయాలున్నాయి. వాటితో నేను అంగీకరించలేను. అందుకే..ఇంతటితోనే నా ప్రసంగాన్ని ఆపేస్తున్నాను. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను" అని వెళ్లిపోయారు.

కాగా గత ఏడాది కూడా బడ్జెట్‌ సమావేశంలో ప్రభుత్వం సిద్ధం చేసి ఆమోదం పొందిన ప్రసంగంలోని కొన్ని భాగాలు మినహాయించి, కొన్ని వాక్యాలు అదనంగా చేర్చి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం గవర్నర్‌, స్టాలిన్‌ సర్కార్‌ మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. గవర్నర్‌ సొంతగా చేర్చిన వ్యాఖ్యలను సభా రికార్డులో చేర్చకూడదని, ప్రభుత్వం సిద్ధం చేసిన గవర్నర్‌ ప్రసంగాన్ని మాత్రమే యధాతథంగా రికార్డులో నమోదు చేయాలంటూ స్టాలిన్‌ తీసుకొచ్చిన తీర్మానం నెరవేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత శాసనసభ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగాన్ని సిద్ధం చేసి గవర్నర్‌కు పంపింది. ఈసారి కూడా ప్రసంగంలో గవర్నర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టారు.




Tags:    

Similar News