లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)ను తదుముట్టించిన శ్రీలంక ఉలిక్కిపడింది. లంక బలగాలు చంపేసిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కూతురు తెరపైకి వచ్చింది. ‘‘నేను మీ ప్రియమైన వేలుపిళ్లై ప్రభాకరన్ కూతురిని. నా పేరు ద్వారాకా ప్రభాకరన్’’ అంటూ ఆమె తనను తను తమిళంలో పరిచయం చేసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. ఎల్టీటీటీ ‘అమరవీరుల దినం’గా జరుపుకునే రోజునే ఈ వీడియో బయటికి రావడంతో లంకలో కలకం రేగుతోంది.
‘‘నేను ఎన్నో కష్టాలు, ద్రోహాలను తట్టుకుని ఇక్కడికి వచ్చాను. ఏదో ఒకనాడు ఈలానికి కూడా వెళ్లి తమిళులకు సేవచేస్తాను. శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీఈని ఢీకొనే సత్తా లేక పెద్ద దేశాల సాయం కోరింది. విదేశాల్లోని తమిళలందరూ లంకలోని తమిళలకు అండగా నిలబడాలి. మాది స్వతంత్ర్య పోరాటం మాత్రమే. అణచివేతకు వ్యతిరేకంగానే పోరాడాతున్నాం. మేం సింహళీయులకు వ్యతిరేకం కాదు. మా పోరాటం ఇకముందూ కొనసాగుతుంది. ఏకత్వంలో భిన్నత్వం మనకు అవసరం. తమిళుల స్వయంప్రతిపత్తి ఆకాంక్షను నెరవేర్చుకోడానికి పోరాడతాం. సింహళీయులు మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ద్వారక చెప్పింది. అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అని లంక ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ఈ వీడియోను సృష్టించి ఉంటారని అనుమానిస్తోంది.