ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనీస మద్దతు ధర కోసం పోరు బాట పట్టిన అన్నదాతలు కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి పోరు బాటు పట్టారు. మొక్కజొన్న, పత్తి, మూడు రకాల పప్పు దినుసులను ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. మరోసారి ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ బార్డర్ లో హై టెన్షన్ నెలకొంది.
పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభూ బార్డర్ వద్ద మానవహారంగా నిలిచిన రైతులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 10వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లతో నిరసన తెలుపుతున్నారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో నిరసనలో పాల్గొంటున్న యువ రైతులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో శంభూ బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా బారికేడ్లు, వైర్లతో ఫెన్సింగ్ లు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు ముందుకు కదల కుండా రోడ్లపై మేకుల వేశారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. కీలకమైన ఘాజీపూర్, టిక్రీ, నోయిడా, సింగూ బార్డర్ల వద్ద భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించారు. దేశ రాజధానిలో నెల రోజుల వరకు సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. అన్నదాతల డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఐదో దఫా చర్చలకు ఆహ్వానించారు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రుల బృందం చేసిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని రైతులు అంటున్నారు. కనీస మద్దతు ధరను కేవలం రెండు మూడు పంటలకు మాత్రమే వర్తింపజేయడం సమంజసం కాదని వారంటున్నారు. కేంద్ర ప్రతిపాదన వల్ల ఇతర పంటలు పండించే రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పప్పు దినుసులపై కనీస మద్దతు ధరకు హామీ ఇస్తే రూ.1.5 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అన్నారని, అయితే వ్యవసాయ పంటల ధర కమిషన్ మాజీ ఛైర్మన్ ప్రకాష్ కమ్మర్ది అధ్యయనం ప్రకారం అన్ని పంటలకు ఎంఎస్పీ వర్తింపజేస్తే మొత్తం వ్యయం రూ.1.75 లక్షల కోట్లు అవుతుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
#WATCH | Jaipur: Police use water cannon against Indian Youth Congress workers protesting on the issue of unemployment. pic.twitter.com/Ev1tXFU0KQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 21, 2024