ఎన్నికల్లో నేతలు కాదు.. జనం గెలవాలి : కేసీఆర్

Update: 2023-06-15 13:51 GMT

ఎన్నిక‌ల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌తి ఎన్నిక‌లోనూ నేత‌లు కాదు.. జ‌నాలు గెల‌వాలని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల్లో జ‌నం గెలిస్తే స‌మాజమే మారుతుందన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ" లక్ష్యం లేని దేశంగా భారత్ ప్రయాణిస్తోంది. జ‌నం చంద్రుడు, న‌క్ష‌త్రాలు కోర‌డం లేదు.. నీళ్లు ఇవ్వ‌మ‌ని కోరుతున్నారు. 8 రోజులకు ఒకసారి ఔరంగాబాద్‌లో తాగునీరు వస్తోంది. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన దిల్లీలోనూ ఇదే దుస్థితి. దేశంలో నెం. 1 రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. కానీ ఇక్కడి పరిస్థితులను ఏ పార్టీ, ఏ సీఎం మార్చలేదు. దేశ రాజధానిలో కూడా తాగునీరు దొరక్కడం లేదు. విద్యత్‌ కొరత సమస్య వేధిస్తోంది. మహారాష్ట్రలో అనేకమంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే లక్షల సంఖ్యలో బీఆర్ఎస్ సభ్యత్వాలు నమోదవుతాయి. మహారాష్ట్రలో వచ్చిన పరివర్తన దేశమంతా వ్యాపిస్తోంది. పుణె, ఔరంగబాద్‌లో భారాస కార్యాలయాలు త్వరలో ప్రారంభిస్తాం. మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చే వరకు పోరాడతాం" అని కేసీఆర్ తెలిపారు

ఉచిత విద్యుత్‌, ఉచిత నీరుతో తెలంగాణలో సాగును పండుగలా మార్చామని కేసీఆర్ వివరించారు. " వరి ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్రంలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోంది. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ లభిస్తోంది. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నాం . దేశం మారాల్సిన సమయం వచ్చింది. ఎస్సీల పరిస్థితులు మారనంత వరకు దేశం అభివృద్ధి చెందదు. భారత్ తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వొచ్చు. భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు" అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News