Telangana Assembly Poll : నేటి నుంచే పోస్టల్‌ ఓటుకు దరఖాస్తు.. వారికి మాత్రమే అవకాశం..

Byline :  Veerendra Prasad
Update: 2023-11-03 04:29 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం దివ్యాంగులకు, 80 యేండ్ల పైబడిన వారందరికి కల్పించింది. అయితే ఇలా ఇంటి వద్దనే ఓటు వేయాలనుకొనేవారు నేటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 7వ తేదీలోగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో) దగ్గర ‘12డీ’ ఫారం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 80 ఏండ్లు పైబడిన వృద్ధులతో పాటుగా 13 అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్‌ ఓటు సౌకర్యం కల్పించారు ఈసీ అధికారులు. వీరు ఆయా శాఖల నోడల్‌ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలట్‌ సౌకర్యం కల్పించారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఓ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా, వారంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ సారి పోస్టల్‌ ఓటు హక్కు, ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే దాదాపుగా 13 లక్షలకు పైగా అర్హులు ఉన్నారు.

పోలింగ్ కు ముందు, ఏవేని 2 తేదీల్లో తపాలా ఓటు వేసేందుకు ఆర్వో అవకాశమిస్తారు. అనుకూలమైన రోజును ఓటరు ఎంచుకోవచ్చు. రాజకీయ పార్టీలకు ఆయా తేదీలు, సమయం, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు చేరతాయి. అవసరం అనుకుంటే ఏజెంట్లు కూడా రావొచ్చు. ఈ తతంగాన్నంతా వీడియోలో చిత్రీకరిస్తారు. ఓటరు ఇంట్లోనే పోలింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఎవరికీ కనిపించకుండా ఓటరు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశాక ఆ బ్యాలెట్ పేపర్ ను చిన్నపాటి కవరు(ఫారం - 13సీ)లో ఉంచి సీల్ వేసి ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఓటు వేసినట్లు ధ్రువీకరణ పత్రం (ఫారం - 13ఏ)పై ఓటరు సంతకం చేయాలి. ఈ రెండింటినీ ఎన్నికల అధికారి మరో కవరులో (ఫారం - 13సీ) పెట్టి ఓటరు సమక్షంలోనే సీల్ చేస్తారు. ఇలా సేకరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సాయంత్రం రిటర్నింగ్ అధికారికి చేరుతాయి.




Tags:    

Similar News