‘‘తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి’ అంటూ జడలబర్రెను ముడ్డిమీద తంతున్న వీడియో ట్వీట్ చేసిన కలకలం రేపిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. కషాయ దళంలోని అంతర్గత విభేదాలను, ఆశ్రిత పక్షపాతాన్ని బయటపెడుతూ మరో ట్వీట్ వదిలారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆయనకు పార్టీలో ప్రాధాన్యం దక్కాలని కామెంట్ పెట్టారు. రఘనందన్‌ను పొగిడే ఉద్దేశంతోనే పెట్టినా పార్టీలో తనకు, ఆయనకు పడని వారిని ఉద్దేశించి పరోక్షంగా ఈ ట్వీట్ చేసినట్లు, పార్టీలో పనిమంతులకు అన్యాయం జరగుతుతున్నట్టు ఈ పోస్ట్ ఉందని కమల నేతలు గుసగుసలాడుతున్నారు.
ట్వీట్‌లో రఘునందన్ మాట్లాడుతున్న వీడియోను జతచేసి, ‘మీ వాగ్దాటికి గర్విస్తున్నాను. మిమ్మల్ని పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించాలి’’ అని కోరిక వెలిబుచ్చారు. రఘునందన్ కేసీఆర్, హరీశ్ రావులపై మండిపడుతున్న వీడియో అది. జితేందర్ తన ట్వీట్‌ను బీజేపీ అగ్రనేతలైన జేపీ నడ్డా బీఎల్ సంతోష్, అమిత్ షాలకు ట్యాగ్ చేశారు. తెలంగాణ బీజేపీ కమిటీలో హైకమాండ్ భారీ మార్పులు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రఘునందన్‌కు జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ కట్టబెట్టాలని జితేందర్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ అత్యధి ప్రాధాన్యమివ్వడం నచ్చక రఘనందన్ రెడ్డి అసంతృప్తికో కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనలాంటి వారికి అన్యాయం జరుగుతోందన్నట్లు జితేందర్ అన్యాపదేశంగా ట్వీట్ చేయడంతో పార్టీలో చర్చ జరుగుతోంది.
Proud of your voice. I support you as national spokesperson @blsanthosh @AmitShah @JPNadda @BJP4Telangana pic.twitter.com/3Cvafg7dAn
— AP Jithender Reddy (@apjithender) July 1, 2023