గవర్నర్లకు రాజకీయాలపై మాట్లాడే హక్కు ఉంది: తమిళిసై సౌందరరాజన్

గవర్నర్ వర్సెస్ బీజేపీ చీఫ్

Update: 2023-07-10 02:23 GMT

రాజకీయ చర్చల్లో పాల్గొనేందుకు రాజకీయ పార్టీల నేతలకు ఉన్న హక్కు.. గవర్నర్‌లకు కూడా ఉందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) తమిళిసై సౌందరరాజన్ నొక్కి చెప్పారు. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం మానుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి అన్నామలై తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో ఓ విలేకరి.. తెలంగాణ గవర్నర్ తరచుగా మీడియాతో రాజకీయాల గురించి మాట్లాడతారని ప్రశ్నించగా.. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం మరియు అలాగే క్రమం తప్పకుండా విలేకరుల సమావేశాలు నిర్వహించడం లాంటి పనులు మానుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో తమిళిసై.. శనివారం కోయంబత్తూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఒక చట్రానికి పరిమితమై ఉండలేనని, అవసరం అనుకున్నప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. రాజకీయ చర్చల్లో అందరూ పాల్గొంటారు కాబట్టి గవర్నర్‌లకు కూడా ఆ చర్చకు స్వేచ్ఛ ఉండాలి అని అన్నారు. అలాగే ఎవరైనా గవర్నర్ల అభిప్రాయంతో విభేదించవచ్చని, కానీ వారిపై విరోధం పెంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఆయన (ఆర్‌ఎన్‌ రవి) ఎక్కడికి వెళితే అక్కడ పోస్టర్లు అంటించడం, నల్లజెండాలు ప్రదర్శించడం మంచి రాజకీయాలు అనిపించుకోవని పరోక్షంగా డీఎంకే ప్రభుత్వానికి సూచించారు.

Tags:    

Similar News