ఢిల్లీలో టెన్షన్.. ఇనుప కవచాలు, జూట్ బ్యాగులతో రైతులు సిద్ధం

Update: 2024-02-20 12:04 GMT

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోకపోవడంతో రైతులు మరోసారి ఢిల్లీలో ఛలో మెగా మార్చ్ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రేపటి నుంచి మళ్లీ ఢిల్లీకి యాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి ఢిల్లీలోకి అనుమతించమని చెప్పేయడంతో ఈసారి రైతులు తమదైన ఏర్పాట్లు చేసుకున్నారు. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను సెక్యూరిటీ సిబ్బంది ప్రయోగించిన సంగతి తెలిసిందే. వాటిని ఎదుర్కొనేందుకు రైతులు మరోదారిని ఎంచుకున్నారు. ఇనుప కవచాలు, జూట్ బ్యాగులతో మరోసారి ఆందోళనలు చేయడానికి సిద్దమయ్యారు.

పంటలకు కనీస మద్ధతు ధరపై చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సహా అనేక డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫిబ్రవరి 13వ తేదిన ఢిల్లీకి మెగా మార్చ్‌ను రైతులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా చేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్దే రైతులను నిలిపివేసింది. ఆ సమయంలో రైతులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించగా వారిపై వాటర్ క్యాన్లను ప్రయోగించింది. దీంతో రైతులు అక్కడే కూర్చోని నిరసన తెలిపారు.

పప్పులు, మొక్కజొన్న, పత్తి వంటిి మూడు పంటలకు 5 ఏళ్లపాటు పాత కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో బుధవారం నుంచి ఆందోళనలు చేపడుతామని రైతులు తెలిపారు. ఈ సారి పోలీసుల చర్యలను ఎదుర్కొనేందుకు ఇనుప షీల్డ్‌లు, జూట్ బస్తాలను రైతులు సిద్ధం చేసుకున్నారు. హర్యానా సరిహద్దు వద్దకు ఇనుప కవచాలు, జూట్ బ్యాగులను కూడా తరలించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News