మూఢ నమ్మకాలతో ముక్కుపచ్చలారని చిన్నారి వేళ్లను వేడి వేడి నూనెలో కాల్చింది ఓ తల్లి. బిడ్డ పుట్టి ఐదు రోజులు కావస్తున్నా పాలు తాగకపోవడంతో ఎవరో చెప్పారని ముందు వెనుక ఆలోచించకుండా ఈ దారుణానికి దిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. దీంతో ఈ విషయం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దారుణమైన సంఘటన జరిగింది. బారాబంకీ జిల్లా ఫతేపుర్ ప్రాంతం ఇస్రౌలి గ్రామానికి చెందిన ఆసియా బానో జూన్ 11న ఫతేపుర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం మొదటి 3 నుంచి 4 రోజులు చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత తల్లి పాలు తాగడం మానేశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆసియకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు ఇచ్చిన సలహాతో ముందూ వెనకా ఆలోచించకుండా తన ఐదు రోజుల బిడ్డ వేళ్లను వేడి వేడి నూనెలో ముంచి తీసింది. దీంతో ఈ విషయం కాస్త ఆస్పత్రి మొత్తం వ్యాపించింది. నైట్ డ్యూటీ చస్తున్న నర్స్ ఈ విషయాన్ని గుర్తించి డాక్టర్‌కు రిపోర్ట్ చేసింది. వెంటనే చిన్నారికి వైద్యం చేసిన వైద్యుడు ఆ తరువాత, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయింది ఆసియా . ఈ క్రమంలో మూడో చిన్నారి కూడా పాలు తాగకపోవడంతో , ఈ బిడ్డ తనకు దూరం అవుతాడనే ఆందోళనతో ఈ దారుణం చేసి ఉండవచ్చని అక్కడివారంతా భావిస్తున్నారు.