Droupadi Murmu : అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోంది: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Update: 2024-01-31 07:41 GMT

పార్లమెంటు బడ్టెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త పార్లమెంటు భవనంలో మొదటిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశ అభివృద్ది గురించి, ప్రభుత్వ విజయాల గురించి ప్రసంగించారు. జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు. భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకుంటున్నామని, ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డుకెక్కిందన్నారు.

ఆదిత్య ఎల్1 మిషన్ దిగ్విజయంగా భారత్ ప్రయోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి 107 పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలను సాధించిందని, తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించాయన్నారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోందన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.

తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థానప జరిగిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలను అధిగమించిన విషయాన్ని తెలిపారు. ఎన్నో ఏళ్ల భారతీయుల కల రామమందిర నిర్మాణంతో సాకారమైందన్నారు. దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగవంతంగా విస్తరిస్తోందని, కొత్త క్రిమినల్ చట్టాన్నీ తీసుకొచ్చామని తెలిపారు. రూ.4 లక్షల కోట్లతో దేశమంతా తాగునీటి వసతిని కల్పిస్తున్నామన్నారు. కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వివరించారు.


Tags:    

Similar News