43 మందితో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 43 మందితో కూడిన రెండో జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రిలీజ్ చేశారు. నిన్న సీఈసీ సమావేశం జరిగింది. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి దాదాపు 43 మంది పేర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ చేసిందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మార్చి 8వ తేదిన తమ పార్టీ అభ్యర్థులతో కూడిన 39 మంది అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో 10 మంది జనరల్ అభ్యర్థులు ఉన్నారు. మరో 13 మంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు. ఇంకో 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. రాష్ట్రాల వారీగా చూసినట్లైతే అసోంలో 12 మంది, గుజరాత్‌లో 7 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, రాజస్థాన్‌లో 10 మంది, ఉత్తరాఖండ్‌లో 3, డమన్ అండ్ డయ్యులో ఒక అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ 82 మంది అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది.
రెండో జాబితా విడుదల సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పేదల కోసం, వారి అభివృద్ధి కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. 2024 ఎన్నికలు ధనికులకు, పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, అందులో ప్రజలంతా కాంగ్రెస్ సర్కార్‌కే పట్టం కట్టాలన్నారు. ప్రజలందరికీ న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ అహర్నిశలు కృషి చేస్తోందని కేసీ వేణుగోపాలు తెలిపారు.