ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు ఓటర్లు షాక్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-27 05:20 GMT

సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు.. తమ సమస్యలేంటో విన్నవిస్తారు ఓటర్లు. తమ డిమాండ్లు ఇవని చెబుతూ.. అవి పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెబుతారు. ఇక అభ్యర్థులు కూడా ఓట్ల కోసం.. పలు హామీలు ఇస్తుంటారు. మామూలు ఓటర్లు అయితే తమ ఊరికి రోడ్డు కావాలనో, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలనో లేదంటే.. మంచి నీటి ఎద్దడి సమస్య తీర్చాలనో, సాగు నీరు కావాలనో డిమాండ్ చేస్తారు. అయితే... మధ్యప్రదేశ్ లోని ఓటర్లు ఇందుకు పూర్తి భిన్నం. తమకు తుపాకీ లైసెన్సులు కావాలంటూ ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు షాక్ ఇస్తున్నారు.

మరో నెలరోజుల్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని నిర్మూలించడానికి భిండ్‌ నియోజకవర్గ ఓటర్లు తమకు తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు. తుపాకీ లైసెన్సు ఉంటే.. దేశంలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చన్నది వారి ఉద్దేశం. మధ్యప్రదేశ్‌లోని నిరుద్యోగ సమస్యకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపనందున ఓటర్ల తుపాకీ లైసెన్సు డిమాండు న్యాయమైనదేనని భిండ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేశ్‌సింగ్‌ చతుర్వేది అంటున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి నరేంద్రసింగ్‌ కుశ్వాహా కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు.




Tags:    

Similar News