Serial Train Accidents: మోదీ ప్రధాని అయ్యాక.. జరిగిన రైలు ప్రమాదాలివే

Update: 2023-10-30 09:14 GMT

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా ఇదే ఏడాది జూన్ 2వ తేదీన ఓడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపం వల్ల మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 300 మంది వరకు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత అప్డేటేడ్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ.. ప్రధాని అయినప్పటి(2014 మే 26) నుంచి ఇప్పటి వరకు జరిగిన భారీ రైలు ప్రమాదాల (Major train accidents) గురించి ఓ సారి పరిశీలిస్తే..

గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌

2014, మే 26న గోరఖ్‌ఫూర్‌ వైపు వెళ్తున్న గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌నగర్‌ ప్రాంతంలోని ఖలీలాబాద్‌ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో 25 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు.

ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌

2016, నవంబర్‌ 20న ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కాన్సూర్‌ పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది మరణించారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారు.

కైఫియత్ ఎక్స్‌ప్రెస్..

2017 ఆగస్టు 23న, దిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ 9 కోచ్‌లు, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు.

పురి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్..

2017 ఆగస్ట్ 18న, పురి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడం వల్ల 23 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు

బికనీర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌..

2022, జనవరి 13న బికనీర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్‌లో పట్టాలు తప్పింది. దీంతో 12 బోగీలు ట్రాక్‌ మీదినుంచి పక్కకు వెళ్లడంతో 9 మంది మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

2023 , జూన్ 2 న ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

విశాఖపట్టణం-పలాస రైలు

2023, అక్టోబర్ 29 న ఏపీలోని విజయనగరం జిల్లాలో కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. ఈ రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు.

Tags:    

Similar News