టమాటా రైతు కన్నీళ్లు... దారుణంగా పడిపోయిన ధర

Byline :  Veerendra Prasad
Update: 2023-09-07 07:13 GMT

కొండెక్కిన రేట్లతో నెలలపాటు సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టిన టమాట ధర అమాంతంగా పడిపోయింది. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు నేలకు దిగొస్తున్నాయి




 


గడిచిన నెల రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలో కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు..ఇప్పుడు టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన టమోటా… ఇప్పుడు కీలో 5 రూపాయలు కూడా పలకడం లేదు. కర్నూలుజిల్లా పత్తికొండ, ప్యాపిలీ మార్కెట్లో టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఎంతో ఆశతో మార్కెట్‌కు వచ్చిన రైతులు, తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కిలో టమోటా కనీసం 5 రూపాయలకు కూడా కొనడంలేదని వాపోతున్నారు. పంట దిగుబడి పెరగడంతో మార్కెట్‌కు సరుకు రావడం పెరిగింది. 30 కిలోల టమాటా కూడా రూ. 100 లోపే ఉంది. కొనే వారు లేక టమాటాలను రోడ్లపైనే పడేస్తున్నారు.




Tags:    

Similar News