రైలు ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించాం.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
రైలు ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించాం.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఒడిశాలోని బాలాసోర్ లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని రైల్వే శాఖ మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ చెప్పారు. బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ మరమ్మత్తు పనులను కేంద్ర మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ ఆదివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అంతేకాదు మృతదేహలను ఆసుపత్రులకు తరలించినట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 7వ తేదీ(బుధవారం) సాయంత్రం లోపుగా రైల్వేట్రాక్ పునరుద్దరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ పూర్తైతే వెంటనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరించనున్నట్టుగా మంత్రి తెలిపారు.
కోరమండల్ రైలు ప్రమాదానికి గల బాధ్యులను కూడా గుర్తించామని మంత్రి వివరించారు. ఈ ప్రమాదంపై రైల్ సేఫ్టీ కమిషనర్ విచారణ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు.